కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును ఇకపై ‘సేవా తీర్థ్’ గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పేరు సేవ స్ఫూర్తిని మరియు జాతీయ ప్రాధాన్యతలకు సంబంధించిన పని ప్రదేశాన్ని ప్రతిబింబిస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 78 ఏళ్లుగా సౌత్ బ్లాక్‌లోని కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్న పీఎంఓను, సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న కొత్త ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోకి మార్చనున్నారు.
పాలనలో కర్తవ్యం, పారదర్శకతను ప్రతిబింబించేలా ఈ సంస్కరణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే, దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్‌ల పేర్లను కూడా ఇక నుంచి ‘లోక్‌భవన్‌లు’ గా మారుస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, గతంలో రాజ్‌పథ్‌కు కర్తవ్య పథ్ అని, ప్రధాని అధికారిక నివాసానికి లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు మార్చడం ద్వారా ‘అధికారం అనేది హక్కు కాదు, బాధ్యత’ అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న కొత్త కాంప్లెక్స్‌లో పీఎంఓతో పాటు కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ వంటి కీలక కార్యాలయాలన్నీ ఒకే దగ్గర పనిచేయడం ద్వారా అత్యున్నత స్థాయి పాలనలో సమన్వయం మెరుగుపడుతుందని కేంద్రం చెబుతోంది. ఈ పేరు మార్పులు కేవలం పరిపాలనాపరమైనవే కాకుండా, భారత ప్రజాస్వామ్యం హోదా నుంచి సేవ వైపు, అధికారం నుంచి బాధ్యత వైపు సాగుతున్న భావజాల మార్పును సూచిస్తున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.









