వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గొట్లపల్లి క్లస్టర్‌కు చెందిన నామినేషన్ కేంద్రంలో (పంచాయతీ కార్యాలయం) గుర్తుతెలియని దుండగులు చొరబడి తాళాలు పగలగొట్టి, పలు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. హన్మపూర్, గిర్మాపూర్, జైరాం తండా (ఐ) గ్రామాలకు సంబంధించిన పత్రాలు కనిపించకుండా పోయాయని అధికారులు గుర్తించారు.
ఈ ఉదయం పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని తెరవడానికి వెళ్లగా ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే ఆర్‌ఓ, ఏఆర్‌ఓలతో పాటు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఈ ఘటనపై అధికారులు స్పష్టత ఇచ్చారు. కొన్ని పత్రాలు భౌతికంగా కనిపించకపోయినా, అన్ని నామినేషన్ల వివరాలు ఆన్‌లైన్‌లో భద్రంగా నమోదు చేశామని తెలిపారు. అందువల్ల ఎన్నికల ప్రక్రియ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ నామినేషన్ల చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









