కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా తనతో పాటు ఒక కుక్కపిల్లను పార్లమెంట్ భవనం వద్దకు తీసుకురావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఉదంతంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, రేణుకా చౌదరి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. “ఇది చాలా చిన్న కుక్క, ఎవరినీ కరవదు. కరిచేవాళ్లు పార్లమెంట్ లోపలే కూర్చున్నారు,” అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు, లోపల ఉన్న ‘కరిచే వ్యక్తులే’ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ విమర్శించారు.
అయితే, కుక్కను పార్లమెంట్‌కు తీసుకురావడానికి గల కారణాన్ని రేణుకా చౌదరి వివరించారు. తాను వస్తున్న దారిలో ప్రమాదం నుంచి తప్పించేందుకు ఒక చిన్న కుక్కపిల్లను కాపాడే ఉద్దేశంతోనే తాత్కాలికంగా కారులో తీసుకువచ్చానని, వెంటనే దాన్ని వెనక్కి పంపించేశానని తెలిపారు. “ఒక మూగ జీవికి సహాయం చేస్తే అది సమస్యగా మారుతుందా?” అని ఆమె ప్రశ్నించారు. అంతేకాక, పార్లమెంట్‌కు జంతువులను తీసుకురాకుండా నిరోధించే చట్టం లేదా నిబంధన ఏదీ లేదని ఆమె వాదించారు.
రేణుకా చౌదరి ఎంపీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఎంపీల ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ సంఘటన పార్లమెంటరీ నిబంధనలపై కొత్త చర్చకు దారితీసింది.









