ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025’ ను భారీగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ‘తరలి రండి – ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు అవ్వండి’ అనే నినాదంతో చేపడుతున్న ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధి దిశ, పెట్టుబడులకు అనుకూల విధానాలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ పథక దిశానిర్దేశక పత్రాన్ని కూడా విడుదల చేయనున్నారు.
ఈ అంతర్జాతీయ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మంది ప్రతిష్ఠాత్మక అతిథులు హాజరుకానున్నారు. వీరిలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యూఏఈ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, పలువురు గ్లోబల్ స్థాయి సీఈవోలు, పెట్టుబడిదారులు పాల్గొనడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారు.
ఈ ప్రతిష్ఠాత్మక సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరి, హెచ్‌డీ కుమారస్వామి వంటి ప్రముఖులను కూడా ఆయన ఆహ్వానించనున్నారు. ఈ సందర్శన సమయంలో, రాష్ట్రంలోని జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, బుల్లెట్ ట్రైన్, మెట్రో విస్తరణ వంటి కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన వినతిపత్రాలు కూడా ముఖ్యమంత్రి ప్రధానికి అందించే అవకాశం ఉంది.









