దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి చలి గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో తిరుమల కొండపై వాతావరణం అనుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో, భక్తులంతా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. సోమవారం మొత్తం అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకునే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని, భక్తులు తప్పనిసరిగా గొడుగులు, రెయిన్‌కోట్లు, వెచ్చని దుస్తులు వెంట తీసుకురావాలని టీటీడీ సూచించింది. దట్టమైన పొగమంచు, తడిసిన రోడ్ల కారణంగా ఘాట్ రోడ్లు జారే స్వభావం కలిగి ఉంటాయని హెచ్చరించింది. అందువల్ల, డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచనలు జారీ చేసింది, అలాగే విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరింది.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భక్తులు తమ ప్రయాణాలు, స్వామివారి దర్శన సమయాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని టీటీడీ కోరింది. మరోవైపు, భారీ వర్షాలు, రాష్ట్ర ప్రభుత్వ రెడ్ అలెర్ట్ కారణంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరగాల్సిన భగవద్గీత కంఠస్థ పోటీలను కూడా టీటీడీ వాయిదా వేసింది. ఈ పోటీల తదుపరి తేదీలను త్వరలో వెల్లడించనున్నారు.









