ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడింది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రత్యేకంగా అమరావతికి వచ్చి, 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా మంత్రి నారా లోకేష్‌లతో కలిసి ఈ కార్యక్రమం జరిగింది. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్‌లో కార్యక్రమం జరిగింది.
ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 11:22 గంటలకు APCRDA ప్రధాన కార్యాలయం వద్ద జరిగింది. మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థలకు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులపై మొత్తం రూ. 1,334 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ఈ భవనాలు అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా ఉండి, బ్యాంకులు ఇప్పటి వరకు రెంట్ చేసుకున్న కార్యాలయాల నుంచి తమ కార్యకలాపాలను ఇక్కడికి మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే, అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ఈ సందర్భంగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌గారు అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముందుగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధి పట్ల ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో రాజధాని అభివృద్ధికి మరింత ఆర్థిక సహాయం కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కూలీలు, స్థానికులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నారా లోకేష్ గారు మాట్లాడుతూ.. రైతుల త్యాగం అమరావతి.. మూడు పంటలు పండుతున్న భూములను 5 కోట్ల మంది ఉన్న రాజధానీ కోసం రైతులు భూములు ఇచ్చారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అది అమరావతి అని దాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. నేడు అనేక బ్యాంకులు ఒకే స్ట్రీట్ వద్ద ఉండటం దేశంలో చాలా అరుదైన సంఘటన.. ప్రధాన బ్యాంకులు కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు చాలా వేగంగా పెంచుకుంటాయన్నారు. పెట్టుబడి దారుల విశ్వాసం పెరుగుతుంది అని కూడా చెప్పారు.









