కుట్ర చేసిన తనను కుటుంబం నుంచి దూరం చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదన్నారు. ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్లు తన మీద నోరు వేసుకొని పడిపోతారన్నారు. కాళేశ్వరం పనులను కొనసాగిస్తారా? ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యాకేజ్ 21, 22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు పోయాయని, ప్రజలకు మేలు జరగలేదన్నారు.
తెలంగాణ నా మరో కుటుంబం
‘కుట్ర చేసి నన్ను కుటుంబం నుంచి దూరం చేశారు. ఈ విషయంలో చాలా బాధపడ్డా. నన్ను పంపించిన వారు శునకానందం పొందవచ్చు. నన్ను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెండ్ చేయించారు. మరో కుటుంబమైనా తెలంగాణ కోసమే ధైర్యంగా పనిచేస్తా. రేవంత్ రెడ్డి బీసీ ద్రోహి అని ఇప్పటికే ప్రకటించాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్.
నేను జైల్లో ఉన్నప్పుడు నా పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డాను. తెలంగాణ అనే మరో కుటుంబం నాకు ఉంది. వారి కోసం ధైర్యంగా పనిచేస్తాను’- కవిత
కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉందని కవిత అన్నారు. ఇక్కడ నుంచే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తుచేశారు. ఇక్కడి లీడర్లు చెబితే నమ్మరని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను తీసుకొచ్చి హామీలు ఇప్పించారన్నారు. అయినప్పటికీ ప్రజలు వాళ్ల మాటలు నమ్మి గెలిపించారని గుర్తుచేశారు.
రైలు రోకోల్ ఉద్రిక్తత
కామారెడ్డిలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు నిరసన కార్యక్రమంలో రైలు రోకో చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అడ్డుకున్నారు. కవిత పట్టాలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కవితను పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగి ఆమె చేతికి స్వల్ప గాయమైంది.









