జూబ్లీహిల్స్ నియోజకవర్గం నూతన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగ దినోత్సవం రోజున ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం తన అదృష్టమని నవీన్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో తనతో పాటు తన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై తాను వేసిన కేసును వెనక్కి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గోపీనాథ్ జీవించి ఉన్నా, లేకపోయినా నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగి ఉండేదని, కేసు కోర్టులో విచారణ దశలో ఉండగానే ఆయన మరణించారని ఆయన పేర్కొన్నారు.
ఉప ఎన్నికలో తమకు మద్దతుగా నిలిచిన ఎంఐఎం పార్టీకి నవీన్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు.









