భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధన, బాలీవుడ్ యువ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధన గుండెపోటు లక్షణాలతో అస్వస్థతకు గురికావడంతో అనూహ్యంగా వాయిదా పడింది. ఈ క్లిష్ట సమయంలో పలాష్‌పై సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పలాష్ కుటుంబ సభ్యులు గట్టిగా స్పందించి, వాస్తవాలు తెలియకుండా విమర్శలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పలాష్ కజిన్ సిస్టర్ నీతి తక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పలాష్‌కు మద్దతుగా నిలిచారు.
పెళ్లి ఆగిపోయిందన్న వార్త తెలియగానే సోషల్ మీడియాలో పలాష్ మోసం చేశాడంటూ కొందరు ఊహాగానాలు, ఆరోపణలు గుప్పించారు. ఈ తప్పుడు ప్రచారంపై పలాష్ కజిన్ సిస్టర్ నీతి తక్ తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్ పెడుతూ, “పలాష్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. వాస్తవాలు తెలియకుండా అతడిపై తప్పుడు ప్రచారం చేయకండి. దయచేసి అతడిని విమర్శించడం ఆపి, తన కోసం ప్రార్థించండి” అని ఆవేదన వ్యక్తం చేశారు. కాబోయే మామగారికి అనారోగ్యం చేసిందన్న వార్తతో పలాశ్ ముచ్ఛల్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని ఆయన తల్లి మీడియాకు వివరించారు.
ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ, స్మృతి మంధన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఎంగేజ్‌మెంట్ రీల్‌ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఆమె సహచర క్రీడాకారిణులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శించారు. ఈ రీల్ కనిపించకపోవడంతో అభిమానుల్లో పెళ్లి వాయిదాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే, స్మృతి తండ్రి ఆరోగ్యం కోలుకోవడమే తనకు ముఖ్యమని, ఆయన పూర్తిగా ఆరోగ్యవంతులైన తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్మృతి ఇప్పటికే స్పష్టం చేశారు.









