ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇటీవల హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన మాటలు హిందూ భావాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP) కఠినంగా స్పందించింది. రాజమౌళి తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన సినిమా ప్రదర్శనలను నిలిపివేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వీహెచ్‌పీ హెచ్చరించింది.
వీహెచ్‌పీ నేత తనికెళ్ల సత్యకుమార్ మాట్లాడుతూ, “రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని అనడం ధర్మాన్ని అవమానించడమే. పుణ్యక్షేత్రాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలపై ఇలాంటి మాటలు సహించబోము” అని మండిపడ్డారు. రాజమౌళి పొందిన విజయాలు ఆయన మాటల్లో అహంకారాన్ని తెచ్చాయని, ఈ ధోరణి అంగీకారయోగ్యం కాదని తెలిపారు. “హిందూ దేవతలను తక్కువ చేసి మాట్లాడితే మేము క్షమించము. అవసరం అయితే ఆయన సినిమాలకు కూడా వ్యతిరేకంగా పోరాడతాం” అని ఆయన స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు హిందూ సంఘాలతో పాటు రాజకీయ వర్గాలను కూడా కదిలించాయి. పలు బీజేపీ నాయకులు రాజమౌళి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడటం ఏ ప్రముఖుడికైనా సరికాదని సూచించారు. ఈ నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టీ రాజమౌళి స్పందనపైనే ఉంది. ఆయన అధికారికంగా క్షమాపణ చెబితేనే ఈ వివాదం సద్దుమణుగుతుందని, లేకపోతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.









