ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అతని బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రాంగణంలో అనుకోకుండా ఎదురుపడ్డారు. దాదాపు ఆరేళ్ల తర్వాత జగన్ తన అక్రమాస్తుల కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. అదే సమయంలో, తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో సునీత కూడా న్యాయస్థానానికి వచ్చారు.
ఒకే కుటుంబానికి చెందిన పెదనాన్న, చిన్నాన్న పిల్లలైన వీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నా పలకరించుకోకపోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్, సునీతను చూసినా ముఖం తిప్పుకుని వెళ్లిపోయారని సమాచారం. వివేకా హత్య కేసులో జగన్‌పై సునీత పలుసార్లు ఆరోపణలు చేయడంతో, వీరి కుటుంబాల మధ్య దూరం పెరిగింది. తన తండ్రి హంతకులను జగన్ కాపాడుతున్నారని సునీత మీడియా ముందే ఆరోపించిన విషయం తెలిసిందే.
దీంతో, వేర్వేరు కేసుల్లో ఒకేసారి న్యాయస్థానానికి హాజరైన ఈ అన్నాచెల్లెళ్లు కనీసం పలకరించుకోకపోవడం రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సునీతను జగన్ పలకరించకపోవడం ఈ విభేదాలకు నిదర్శనంగా నిలిచింది. జగన్ సుమారు అరగంట పాటు కోర్టు వద్ద ఉన్నప్పటికీ, కోర్టు హాలులో మాత్రం ఐదు నిమిషాలే ఉండి తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేసి బయటకు వచ్చారు.









