ప్రతిష్ఠాత్మక మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్‌కు చెందిన మానిక విశ్వకర్మ టాప్ 12లో చోటు దక్కించుకోలేకపోయింది. శ్రీ గంగానగర్‌కు చెందిన మానిక విశ్వకర్మ, ఆరంభంలో అద్భుత ప్రదర్శనతో టాప్ 30 వరకు చేరుకుని ఆశలు రేకెత్తించినప్పటికీ, తుది రౌండ్‌లలో నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ఈ ఏడాది మిస్ యూనివర్స్ రేసు నుంచి భారత్ నిష్క్రమించింది.
మానిక విశ్వకర్మ నిష్క్రమణకు ప్రధాన కారణం స్విమ్‌సూట్ రౌండ్‌లో ఆమె ప్రదర్శన న్యాయనిర్ణేతలను ఆకట్టుకోలేకపోవడమే. తెల్లటి మోనోకినీలో కనిపించిన మానిక, ఈ ముఖ్యమైన రౌండ్‌లో తగినంతగా రాణించలేకపోవడంతో తదుపరి దశకు అర్హత సాధించలేకపోయింది. చైనా, కొలంబియా, థాయ్‌లాండ్, అమెరికా, మెక్సికో వంటి బలమైన దేశాల సుందరీమణులతో పాటు టాప్ 30లో నిలిచినప్పటికీ, టాప్ 12కు చేరుకోలేక నిరాశ పరిచింది.
ప్రస్తుతం గ్వాడెలోప్, కొలంబియా, క్యూబా, మెక్సికో, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, చైనా, వెనిజులా సహా 12 దేశాల సుందరీమణులు ఈవినింగ్ గౌన్ రౌండ్‌లో విజేత టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు, ఈ వేదికపైనే 2026లో జరగబోయే 75వ మిస్ యూనివర్స్ పోటీలకు ప్యూర్టోరికో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే మిస్ యూనివర్స్ 2025 విజేత ఎవరో తేలిపోనుంది.









