బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా, గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో హింసకు దారితీసిన ఘటనలపై ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) తనకు ఉరిశిక్ష విధిస్తూ వెలువరించిన తీర్పుపై తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యబద్ధం కాదని, ట్రైబ్యునల్ పక్షపాతంతో వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడని ప్రభుత్వంలోని తీవ్రవాదుల హత్యాకాండ ఉద్దేశాన్ని బయటపెట్టిందని హసీనా ధ్వజమెత్తారు. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలను ఆమె పూర్తిగా తిప్పికొట్టారు, మరణాలన్నింటిపైనా విచారం వ్యక్తం చేస్తూనే, తాను లేదా తమ పార్టీ నాయకులు ఎవరూ ఆందోళనకారులను చంపమని ఆదేశించలేదని స్పష్టం చేశారు.
హసీనా ఈ న్యాయ ప్రక్రియను మోసపూరితమైనది అంటూ తీవ్రంగా విమర్శించారు. ట్రైబ్యునల్, దాని సభ్యులు పక్షపాతంతో వ్యవహరించారని, న్యాయమూర్తులు, లాయర్లు ప్రస్తుత ప్రభుత్వానికి బహిరంగంగా సానుభూతి వ్యక్తం చేశారని ఆరోపించారు. ముఖ్యంగా, కోర్టు తనకు న్యాయమైన రక్షణ అవకాశం ఇవ్వలేదని, విచారణకు హాజరుకాకపోయినా తన తరఫున లాయర్లు ప్రాతినిధ్యం వహించేందుకు కూడా అనుమతించలేదని ఆమె విమర్శించారు. ‘ఇంటర్నేషనల్’ అనే పేరు ఉన్నప్పటికీ, ఐసీటీలో అంతర్జాతీయత ఏమీ లేదని, అది నిష్పాక్షికం కూడా కాదని హసీనా అన్నారు.
తన పార్టీ అవామీ లీగ్‌కు మాత్రమే ఐసీటీ ప్రత్యేకంగా విచారణ చేపట్టిందని, మతపరమైన మైనార్టీలు, ఇతరులపై హింసను ప్రేరేపించిన వేరే పార్టీలకు చెందిన కుట్రదారులను విచారించడానికి లేదా దర్యాప్తు చేయడానికి కూడా ప్రయత్నించలేదని హసీనా ఆరోపించారు. అవామీ లీగ్‌పై నింద మోపడం అనేది డాక్టర్ మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రపంచ దృష్టి నుంచి మరల్చడమేనని ఆమె ధ్వజమెత్తారు. ఈ అభియోగాలను సరైన ట్రైబ్యునల్‌లో ఎదుర్కొనేందుకు తాను భయపడనని ప్రకటించిన హసీనా, హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ముందు ఈ ఆరోపణలను ఉంచాలని మధ్యంతర ప్రభుత్వాన్ని పదేపదే సవాలు చేశానని ఆమె వ్యాఖ్యానించారు.









