భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దాయాది పాకిస్థాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటల ట్రైలర్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ద్వివేది, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకైనా భారత సైన్యం సిద్ధంగా ఉందని, పాకిస్థాన్ దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పాక్‌తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు.
జనరల్ ద్వివేది మాట్లాడుతూ, “పాక్ అవకాశం ఇస్తే.. పొరుగుదేశంతో బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో దాయాదికి మేము నేర్పిస్తాము” అని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల శ్రేయస్సు, పురోగతిపై దృష్టి పెడుతుందని, తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే దీటుగా స్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలతో చర్చలు ఉండవని తేల్చి చెప్పారు.
ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తూ తమ చర్యలను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌కు జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టిగా హెచ్చరించారు. ఆయన ప్రస్తావించిన “న్యూ నార్మల్” విధానం, “ఉగ్రవాదం (టెర్రర్) మరియు చర్చలు (టాక్స్) కలిసి సాగవు” అన్న భారత వైఖరిని మరింత బలోపేతం చేసింది. ఈ వ్యాఖ్యలు సరిహద్దుల్లో ఉగ్రవాదానికి మద్దతిచ్చే శక్తులకు బలమైన సందేశాన్ని పంపాయి.









