మహిళల వన్డే ప్రపంచకప్ (WWC 2025) విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలైన తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీ చరణికి (Sree Charani) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే నజరానా ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం శ్రీచరణి ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఆమె అద్భుతమైన విజయాన్ని గౌరవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, మరియు కడపలో నివాస స్థలం ఇస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేశ్ కూడా ‘ఎక్స్’ వేదికగా ధృవీకరిస్తూ, శ్రీచరణి అంకితభావం ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడేలా చేసిందని పోస్ట్ చేశారు.
స్వరాష్టానికి చేరుకున్న శ్రీచరణికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయం (Gannavaram Airport)లో రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శ్రీచరణి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు శ్రీచరణిని శాలువాతో సత్కరించి, ఆమె ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడారు.
ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి సంతోషంగా ఉందని తెలిపారు. తన విజయంలో తన మామ ప్రోత్సాహం చాలా ఉందని, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో శిక్షణ పొందానని చెప్పారు. ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణపై విలువైన సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు.









