టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami), ఆయన భార్య హసీన్ జహాన్ మధ్య కొనసాగుతున్న భరణం వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హసీన్ జహాన్ భరణం మొత్తాన్ని పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా షమీతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
గతంలో కలకత్తా హైకోర్టు హసీన్ జహాన్‌కు నెలకు రూ. 1.5 లక్షలు మరియు వారి కుమార్తె సంరక్షణ కోసం రూ. 2.5 లక్షలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశించింది. అయితే, ఈ మొత్తం తమ అవసరాలకు సరిపోవడం లేదని, భరణాన్ని మరింత పెంచాలని కోరుతూ హసీన్ జహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం, నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై తదుపరి విచారణ జరపనుంది.
మహ్మద్ షమీ, హసీన్ జహాన్‌ల మధ్య 2018 నుంచి వ్యక్తిగత, న్యాయపరమైన వివాదాలు నడుస్తున్నాయి. అప్పట్లో షమీపై గృహ హింస, వరకట్న వేధింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తన వివాదం గురించి అడిగినప్పుడు షమీ స్పందిస్తూ, “నా పూర్తి దృష్టి నా క్రికెట్‌పైనే ఉంటుంది. నాకు ఈ వివాదాలు వద్దు” అని వ్యాఖ్యానించాడు. తాజా సుప్రీంకోర్టు నోటీసులతో వీరి వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.









