జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, మెట్రో, ఐటీ వంటి రంగాలకు కాంగ్రెస్ పార్టీయే బీజం వేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి విధ్వంసం చేశాయని, వరదల్లో హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం నుంచి కిషన్ రెడ్డి చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కేటీఆర్, కిషన్ రెడ్డిలను ‘బ్యాడ్ బ్రదర్స్’ అని సెటైర్ వేశారు.
గత బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఎత్తి చూపారు. లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరిపాలు చేశారని మండిపడ్డారు. పదేళ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఏం చేశారో బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ తన కొడుకు కోసం వాస్తు సరిద్దడానికి పాత సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారని, అలాగే ఫోన్ ట్యాపింగ్ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని విమర్శించారు.
నగరంలోని చెరువులను ఆక్రమించినందునే **’హైడ్రా’**పై కేటీఆర్ కక్ష కట్టారని సీఎం ఆరోపించారు. అంతేకాకుండా, బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలపై మాట్లాడుతూ హరీష్ రావుకు ఒక్క అడుగే మిగిలి ఉందని, ఆయన కేటీఆర్, కవిత మధ్య గొడవలు పెట్టి బీఆర్‌ఎస్‌కు ముప్పు తెస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ నుంచి బయట వాళ్ళందరినీ విజయవంతంగా బయటకు పంపిన హరీష్ ఇప్పుడు ఇంట్లో కవితను కూడా బయటికి పంపేలా చేశారన్నారు. టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలిపే హక్కు ఇవ్వని వాళ్ళకి ఓటేస్తారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.









