ప్రకృతిలోని అద్భుతాలలో ఒకటిగా గ్రీస్ మరియు అల్బేనియా సరిహద్దులోని ఒక గంధకపు గుహలో ప్రపంచంలోనే అతిపెద్దదైన సాలీడు గూడును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘సల్ఫర్ కేవ్’గా పిలిచే ఈ గుహలో, సుమారు 1,11,000 సాలీళ్లకు నివాసంగా ఉన్న ఈ ‘మహా నగరం’ పరిశోధకులను అబ్బురపరిచింది. ఈ భారీ సాలీడు గూడు గుహ గోడపై ఏకంగా 1,140 చదరపు అడుగుల (106 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ అసాధారణ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను ‘సబ్‌టెర్రేనియన్ బయాలజీ’ అనే ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.
ఈ పరిశోధనలో రెండు కీలకమైన మరియు అసాధారణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఒంటరిగా జీవించే ‘టెజెనారియా డొమెస్టికా’ మరియు ‘ప్రినెరిగోన్ వాగాన్స్’ అనే రెండు వేర్వేరు జాతుల సాలీళ్లు ఈ గూటిలో కలిసి జీవిస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో, రెండు వేర్వేరు జాతులు ఒకే గూటిలో సహజీవనం చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గుహలోని పూర్తి చీకటి కారణంగా వాటి చూపు మందగించి, ఒకదానిపై ఒకటి దాడి చేసుకోకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ గుహలోని గంధకపు నీటి ప్రవాహం కారణంగా పెరిగే సూక్ష్మజీవులను తినే చిన్న కీటకాలు (మిడ్జెస్) ఈ సాలీళ్లకు ప్రధాన ఆహారం. ఈ ప్రత్యేక ఆహారం వల్ల గుహలోని సాలీళ్ల జీర్ణవ్యవస్థ, జన్యు నిర్మాణం కూడా బయట నివసించే వాటి కంటే భిన్నంగా ఉన్నట్లు డీఎన్ఏ పరీక్షల్లో తేలింది. “ఈ గూడును చూసినప్పుడు నాలో కలిగిన భావాలను మాటల్లో చెప్పలేను. ఎంతో ఆశ్చర్యం కలిగింది” అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఇస్వాన్ ఉరాక్ అన్నారు.









