ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన మణిరత్నం, దర్శకధీరుడు రాజమౌళి మరియు ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి ‘బాహుబలి’ని రెండు పార్టులుగా చేసి సూపర్ సక్సెస్ చేయడం వల్లే, తనలాంటి దర్శకులకు భారీ ఎమోషన్స్ ఉండే కథలను ధైర్యంగా తీయగలమనే నమ్మకం వచ్చిందని మణిరత్నం తెలిపారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మణిరత్నం, ముఖ్యంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడానికి ప్రధాన కారణం ‘బాహుబలి’నే అని స్పష్టం చేశారు. “బాహుబలి సినిమా రాకపోయుంటే నేను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయకపోయేవాడిని. గతంలో రెండు పార్టులుగా సినిమాలు చేయడం అనే సాహసం ఎవరూ చేయలేదు” అని ఆయన చెప్పుకొచ్చారు.
భారీ బడ్జెట్‌తో సినిమాలను రెండు పార్టుల్లో చేయడం పెద్ద సాహసమని, అయితే రాజమౌళి ‘బాహుబలి’ చేయడం వల్లనే నాలాంటి వారికి ఒక నమ్మకం వచ్చిందని మణిరత్నం అన్నారు. “మనం కూడా ఇలాంటి కథలను చెప్పగలం అనే స్ఫూర్తిని రాజమౌళి అందించాడు. అందుకే, ఇప్పుడు చాలా మంది అలాంటి సినిమాలు చేస్తున్నారు” అంటూ రాజమౌళిని ప్రశంసించారు. ప్రస్తుతం మణిరత్నం చేసిన ఈ కామెంట్స్ సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.









