బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న నారాయణ హెల్త్, అంతర్జాతీయంగా తన వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. డాక్టర్ దేవిశెట్టి యాజమాన్యంలోని నారాయణ హృదయాలయ, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ హాస్పిటల్ గ్రూపుల్లో ఒకటైన ప్రాక్టీస్ ప్లస్ గ్రూపు హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసింది.
యూకేలో ఆరవ అతిపెద్ద హాస్పిటల్ గొలుసుగా ఉన్న ప్రాక్టీస్ ప్లస్ గ్రూప్ హాస్పిటల్స్‌ను, నారాయణ హృదయాలయ అనుబంధ సంస్థ అయిన నారాయణ హృదయాలయ యుకె లిమిటెడ్ 188.78 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ. 2,200 కోట్లు) కొనుగోలు చేసింది. ప్రాక్టీస్ ప్లస్ గ్రూప్ హాస్పిటల్స్ యొక్క మొత్తం 100% ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్టు నారాయణ హృదయాలయ బిఎస్‌ఇకి దాఖలు చేసిన ప్రకటనలో ధృవీకరించింది.
ప్రాక్టీస్ ప్లస్ గ్రూప్‌లో మొత్తం ఏడు ఆసుపత్రులు, మూడు సర్జికల్ సెంటర్లు, రెండు అత్యవసర విభాగాలు మరియు 330 పడకలు ఉన్నాయి. ఇక్కడ 2,500 మంది సిబ్బంది, 1,300 మంది క్లినికల్ నిపుణులు పనిచేస్తున్నారు. నారాయణ హృదయాలయ వ్యవస్థాపకురాలు డాక్టర్ దేవిశెట్టి మాట్లాడుతూ, “ప్రాక్టీస్ ప్లస్ గ్రూప్ – మేము ఇద్దరం ఒకే దార్శనికతను పంచుకుంటున్నాము. అందరికీ ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం” అని అన్నారు. ఈ కొనుగోలు ద్వారా నారాయణ హృదయాలయ ఒక బలమైన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ బ్రాండ్‌గా ఎదగనుంది.









