ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక ప్రక్రియపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ అవార్డులు ‘రాజీ పడుతున్నాయని’, కేవలం కొందరికి మాత్రమే దక్కుతున్నాయని ఆయన ఘాటుగా ఆరోపించారు. ఇటీవల కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేరళ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా తన అనుభవాన్ని వివరిస్తూ, కేరళ ప్రభుత్వం తమ ప్రక్రియలో ఎటువంటి జోక్యం చేసుకోలేదని, తనకే పూర్తి నిర్ణయాధికారం ఇచ్చిందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. అయితే, జాతీయ అవార్డుల విషయంలో అలా జరగడం లేదని, అది తాము కళ్లారా చూస్తున్నామని అన్నారు. ప్రస్తుత విధానంలో ‘మంజుమ్మెల్ బాయ్స్’, ‘భ్రమయుగం’ వంటి గొప్ప చిత్రాలకు పురస్కారాలు దక్కడం లేదని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన లెజెండరీ నటుడు మమ్ముట్టి గురించి ప్రస్తావిస్తూ, “ఇలాంటి జ్యూరీ, ఇలాంటి ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు.. మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దర్శకులు మరియు రచయితలు కేవలం పెద్దలు మరియు యువత కోసమే కాకుండా, పిల్లల కోసం కూడా మంచి చిత్రాలు తీయడం గురించి ఆలోచించాలని ఆయన చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు.









