ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా నవ రాయ్‌పూర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ హాస్పిటల్‌ను సందర్శించి భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించారు. ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమం కింద ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించుకుని కొత్త జీవితం పొందిన సుమారు 2,500 మంది చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారుల కేరింతలు, నవ్వులతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
ప్రధాని మోదీ పిల్లల వద్దకు వెళ్లి వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. మోదీని కలవడంపై చిన్నారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. “ఆయన చాలా మంచివారు” అని ఓ చిన్నారి ఉత్సాహంగా చెప్పగా, మరో బాలిక “మోదీ గారు నా పేరు అడిగి, మళ్లీ పలికారు. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను” అని గుర్తుచేసుకుంది. ప్రధానిని కలవడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని చిన్నారులు తెలిపారు.
ఈ సందర్భంగా, వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె సంబంధిత చికిత్స అందిస్తూ పునర్జన్మ ప్రసాదిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్యులను, నర్సులను ప్రధాని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, నవ రాయ్‌పూర్‌లోని నూతన ఛత్తీస్‌గఢ్ శాసనసభ భవనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.









