తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మరో పది రోజుల్లో జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక పోరులో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రలు, జనసంభాషణల ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ చేతులు కలిపాయని విమర్శిస్తూ, నవీన్ యాదవ్, అజారుద్దీన్ స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నారని హామీ ఇస్తున్నారు.
ఇక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. షేక్‌పేటలో రోడ్‌షో నిర్వహించి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఓడిపోతేనే రాష్ట్రంలో హామీలు అమలవుతాయని ప్రజలకు చెప్పారు. అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం ఓటర్లను మభ్యపెట్టడానికేనని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత విజయమే ఖాయమని, ఆమె మెజార్టీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై “గెలవలేని రౌడీని పోటీలో నిలబెట్టారు” అంటూ విమర్శలు చేశారు.
మరోవైపు, బీజేపీ కూడా ప్రత్యేక వ్యూహంతో ప్రచారం కొనసాగిస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నేతలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పులను “ఛార్జ్‌షీట్” రూపంలో ప్రజల ముందు ఉంచుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎంఐఎం నిర్ణయించిన వ్యక్తి మాత్రమేనని, కాంగ్రెస్ ఎంఐఎం సహాయంతో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ పోటీ అసలైనది బీజేపీ, ఎంఐఎం మధ్యే ఉందని ప్రజల్లో ప్రచారం చేస్తూ, దీపక్ రెడ్డిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధికి మరింత దోహదం అవుతుందని హామీ ఇస్తున్నారు. ఇలా మూడు పార్టీలు తమ తమ వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.









