మాస్ రాజా రవితేజ ఎంతో నమ్మకంతో “మాస్ జాతర”తో హిట్ కొడుతున్నామని చెప్పినప్పటికీ, దర్శకుడు భాను భోగవరపు మాత్రం ఆయన నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు. గత కొన్నేళ్లుగా ఫ్లాప్ సినిమాలతో విసుగు పుట్టించిన రవితేజ ఈ సినిమాతో కూడా మాస్ ఆడియన్స్‌కి కొత్తదనం చూపించలేకపోయారు. రొటీన్ పోలీస్ కథాంశం, ఊహించదగిన కథనం, బలహీనమైన ఎమోషనల్ కనెక్టివిటీ కారణంగా సినిమా నిరాశపరిచింది.
లక్షణ్ భేరి (రవితేజ) అనే రైల్వే పోలీస్, వరంగల్ నుండి గంజాయి స్మగ్లింగ్ చేసే శివుడు (నవీన్ చంద్ర)ని మట్టుపెట్టడానికి అడవివరం ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ ఫర్ అవ్వడం ఈ సినిమా కథాంశం. కథ కొత్తగా రైల్వే పోలీస్ నేపథ్యంలో ఉన్నా, మిగిలిన సెటప్ మొత్తం రొటీన్‌గా మారింది. రవితేజ పాత సినిమాల రిఫరెన్స్‌లు, ఎనర్జిటిక్ యాక్షన్ ఎపిసోడ్స్, డ్యాన్స్‌లు మాస్ ఫ్యాన్స్‌కి కొంత కిక్ ఇచ్చినా, కథలో కొత్తదనం లేకపోవడం, కామెడీ వర్కౌట్ కాకపోవడం, పాత్రల మధ్య బలమైన కనెక్టివిటీ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్.
సామజవరగమన లాంటి సినిమాకు రైటర్‌గా మంచి మార్కులు తెచ్చుకున్న భాను భోగవరపు.. దర్శకుడిగా మాత్రం విఫలమయ్యారు. రవితేజను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ కథను తెరపై ఎంగేజింగ్‌గా ఆవిష్కరించలేకపోయారు. ముఖ్యంగా, కథలోని కోర్ ఎమోషన్‌ని పండించడంలో విఫలమవడం, అనవసరమైన చోట్ల కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మోతాదుకు మించి ఉండటం, పాత కథాంశాల ఛాయలు కనిపించడం ఈ సినిమాకు ప్రతికూల అంశాలుగా మారాయి.









