ఆంధ్రప్రదేశ్‌లో ‘మొంథా’ తుఫాను విపరీతమైన విధ్వంసం సృష్టించినప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద ఊరట కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రానికి మొత్తం రూ. 5,265 కోట్ల ఆర్థిక నష్టం సంభవించిందని ఆయన వెల్లడించారు. ఈ నష్టం అంచనాలు ప్రాథమికమైనవని, జిల్లాల వారీగా సమగ్ర నివేదికల తర్వాత తుది అంచనా వెల్లడిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వం సమయానికి హెచ్చరికలు జారీ చేసి, ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడం ద్వారానే ప్రాణనష్టం లేకుండా తప్పించగలిగామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
తుఫాను కారణంగా మౌలిక వసతుల రంగం అత్యధికంగా దెబ్బతిన్నట్లు సీఎం వివరించారు. ముఖ్యంగా రోడ్లు, వంతెనలు, డ్రెయినేజీ వ్యవస్థలు దెబ్బతినడంతో రోడ్స్ & బిల్డింగ్స్ (R&B) శాఖకు రూ. 2,079 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో ఆక్వా రంగం తీవ్రంగా దెబ్బతిని, పంటలు, చెరువులు, ఫీడింగ్ యూనిట్లు మునిగిపోవడంతో ఈ రంగానికి రూ. 1,270 కోట్ల నష్టం సంభవించింది. అలాగే, వ్యవసాయ పంటలు తుపాను వర్షాలకు కొట్టుకుపోయి, రైతులకు రూ. 829 కోట్ల నష్టం కలిగిందని వివరించారు.
పునరుద్ధరణ చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వ్యవసాయం, ఆక్వా, విద్యుత్, రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యల కారణంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ఆనకట్టలు సురక్షితంగా ఉన్నాయని సీఎం తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించిన తర్వాత తుది నష్ట నివేదికను సమర్పించి, నష్ట పరిహారం కోసం కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. “ప్రజల ప్రాణాలను కాపాడగలిగాం అది మా పెద్ద విజయం” అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.









