జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్‌పేట డివిజన్‌లో రోడ్డు షో నిర్వహించారు. ఓయూ కాలనీ మీదుగా వినోభానగర్ వరకు సాగిన ఈ ప్రచారంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ కాంగ్రెస్‌కు ఇక్కడ ఓటమి ఎదురైతే, ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “హిట్లర్ నశించడాన్ని చూశామని, కాంగ్రెస్ ఎప్పటి వరకు ఉంటుందో చూస్తాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చి, వారిని రోడ్డుపాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒకప్పుడు ఇందిరమ్మ పేదరికాన్ని నిర్మూలించాలని నినదిస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పేదోళ్లను రోడ్డున పడేస్తున్నారని ఆయన విమర్శించారు.
మాగంటి సునీత హామీ
ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక కుటుంబం అని తన భర్త గోపీనాథ్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మహిళలకు అండగా ఉంటూ, కష్ట సమయాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేవారని అన్నారు. ప్రజలు ఎవరికీ భయపడవద్దని, బీఆర్‌ఎస్ ప్రజలకు అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.









