UPDATES  

NEWS

 మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ కేబినెట్‌లో మైనార్టీలకు మంత్రి పదవి దక్కకుండా బీజేపీ మరియు బీఆర్‌ఎస్‌ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ నేత, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తుంటే, దాన్ని ఓర్వలేక ఈ రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడమే ఈ కుట్రకు నిదర్శనమని చామల పేర్కొన్నారు. అంతేకాకుండా, కేవలం ఫిర్యాదుతోనే ఆగకుండా, మంత్రివర్గ విస్తరణ జరగకుండా ఉండేందుకు ఈ రెండు పార్టీలు గవర్నర్‌పై కూడా ఒత్తిడి తెస్తున్నాయని ఆయన విమర్శించారు.

ఎంపీ చామల బీజేపీ, బీఆర్‌ఎస్‌ల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. “మైనార్టీలంటే ఎందుకంత కడుపుమంట? తెలంగాణ కేబినెట్‌లో మైనార్టీ మంత్రి ఉండొద్దా? రాజకీయ లబ్ది కోసం మతాల మధ్య చిచ్చు పెడతారా?” అంటూ ధ్వజమెత్తారు. భారత క్రికెట్ కెప్టెన్‌గా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలబెట్టిన అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్‌లో చోటు కల్పిస్తుంటే ఈ రెండు పార్టీలు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాయని ప్రశ్నించారు. రాజస్థాన్‌లో గత ఏడాది జనవరిలో ఉపఎన్నిక జరగకముందే సురేందర్‌పాల్ సింగ్‌ అనే వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేస్తూ, “వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా?” అని బీజేపీ నేతలను నిలదీశారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని చామల ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్‌ఎస్‌తో చేసుకున్న అంతర్గత ఒప్పందమే కారణమన్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదన్న కుట్రతోనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలనే లక్ష్యంతోనే ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయని, సర్వేల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటర్లు ఉన్నారని తేలడంతోనే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మైనార్టీ సోదరులు ఈ కుట్రను గుర్తించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |