తెలంగాణ ‘హైడ్రా’ (Hydra) కమిషనర్ ఎ.వి. రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ, కేవలం మర్యాదపూర్వక సమావేశమని పవన్ కల్యాణ్ కార్యాలయం ప్రకటించినప్పటికీ, ఏపీలో కూడా ‘హైడ్రా’ తరహా వ్యవస్థ ఏర్పాటుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో ప్రధానంగా అనధికార నిర్మాణాల కూల్చివేతలు, జలవనరుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేసే ‘హైడ్రా’ కార్యాచరణ, దాని విజయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఐపీఎస్ రంగనాథ్ నేతృత్వంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి కాపాడటం, చెరువులు, కుంటలను పరిరక్షించడం వంటి కఠిన చర్యలకు ‘హైడ్రా’ వ్యవస్థకు మంచి ప్రజాదరణ లభించింది. ఈ నేపథ్యంలో, ఏపీలోనూ నగర పాలనలో సరికొత్త సంస్కరణలు, కబ్జాల నివారణకు తెలంగాణ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అనధికార నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జా, ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని జల వనరుల ఆక్రమణ వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ సమస్యలను నిష్పక్షపాతంగా పరిష్కరించేందుకు, అలాగే విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల భవిష్యత్తు అభివృద్ధికి పట్టణ మౌలిక సదుపాయాల ప్రణాళికలో హైడ్రా పద్ధతులను ఉపయోగించడంపై పవన్ కల్యాణ్ ఆసక్తి చూపించినట్లు సమాచారం. కబ్జాలు తగ్గి ప్రభుత్వ స్థలాలు రక్షించబడాలంటే ‘హైడ్రా’ లాంటి వ్యవస్థ ప్రతీ రాష్ట్రంలో ఉండాలని సగటు పౌరులు కోరుకుంటున్నారు.









