యాక్షన్ హీరోగా సుమన్, ‘యాంగ్రీ యంగ్ మెన్’గా రాజశేఖర్ ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సమాంతరంగా దూసుకుపోయారు. వీరిద్దరి పాత్రలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ వాయిస్ చెప్పేవారు, అది వారి పాత్రలకు సరిగ్గా సరిపోయేది. అయితే, ఈ ముగ్గురి విషయంలో ఒక పుకారు చాలాకాలంగా ప్రచారంలో ఉంది. సాయికుమార్ డబ్బింగ్ చెప్పే విషయంపై సుమన్, రాజశేఖర్‌ల మధ్య గొడవలు వచ్చి, మాట్లాడుకోవడం మానేశారనే టాక్ బలంగా వినిపించేది.
ఈ విషయంపై తాజాగా ‘ఐ డ్రీమ్ పోస్ట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సుమన్ స్పందించారు. రాజశేఖర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని, మొన్నీ మధ్య కూడా ఒక ఫంక్షన్‌లో కలిసినప్పుడు మాట్లాడుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక, తాను హీరోగా చేసిన సినిమాలకు డబ్బింగ్ చెప్పడం వల్లే సాయికుమార్ తొలుత పాపులర్ అయ్యారని, ఆ తర్వాతే రాజశేఖర్‌కు చెప్పడం మొదలుపెట్టారని సుమన్ పేర్కొన్నారు.
ఇక డబ్బింగ్ విషయంలో సాయికుమార్ గ్యాప్ తీసుకోవడానికి గల కారణాన్ని సుమన్ వివరిస్తూ, ‘పోలీస్ స్టోరీ’ తర్వాత సాయికుమార్ హీరోగా బిజీ అవ్వడం వలన తమకు డబ్బింగ్ చెప్పడం కుదరలేదని తెలిపారు. ఆ సమయంలో సాయికుమార్ స్వయంగా తనకు కాల్ చేసి చెప్పారని, తాను సరేనని అంగీకరించానని అన్నారు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారని, తన వైపు నుంచి చూస్తే, రాజశేఖర్‌తో, అలాగే సాయికుమార్‌తో కూడా తనకు మంచి స్నేహబంధం ఉందని సుమన్ దృఢంగా చెప్పారు.









