ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ, అక్కడి నుంచే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా వర్ష ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై ఆయన సీఎస్‌తో పాటు సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడారు.
సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను వెంటనే పంపాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్యుత్ వంటి అన్ని శాఖల సమన్వయం తప్పనిసరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని కూడా ఆదేశించారు. నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తత అవసరమని అధికారులు సీఎంకు వివరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.









