దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమిలో సీట్ల సర్దుబాటు సయోధ్య కుదరలేదు. మహాకూటమిలోని మిత్రపక్షమైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అనూహ్యంగా ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగింది. వాస్తవానికి, ఆరు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయానికి తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ మరియు కాంగ్రెస్ రాజకీయ కుట్ర కారణమని జేఎంఎం సంచలన వ్యాఖ్యలు చేసింది.
తమకు సీట్లు దక్కకుండా చేసి, అవమానానికి గురి చేశారని జేఎంఎం ఆరోపించింది. జేఎంఎం సీనియర్ నేత, ఝార్ఖండ్ పర్యాటక మంత్రి సుదివ్య కుమార్ మాట్లాడుతూ, “రాజకీయ కుట్రలో భాగంగా జేఎంఎం ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం వెనుక ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర ఉంది. దీనికి జేఎంఎం తగిన సమాధానం ఇస్తుంది. ఆ పార్టీలతో ఝార్ఖండ్‌లో పొత్తులపై పునరాలోచిస్తాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని, ఈ ఎన్నికల్లో జేఎంఎం భాగం కాకపోవడంతో మహాకూటమి తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
కాగా, జేఎంఎం వైదొలగినప్పటికీ, ఆర్జేడీ మాత్రం నామినేషన్ల ఉపసంహరణకు కొద్ది గంటల ముందు మొత్తం 145 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మహాకూటమిలో చీలిక ఏర్పడింది. ఇదిలా ఉండగా, అధికార ఎన్డీయే మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి, జేడీయూ, బీజేపీలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తూ సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకున్నాయి. బిహార్ ఎన్నికలు రెండు దశల్లో (నవంబరు 6, 11) జరగనుండగా, నవంబరు 14న ఫలితాలు ప్రకటిస్తారు.









