UPDATES  

NEWS

 అల్లూరి జిల్లాలో దారుణం: భూ వివాదంలో వైసీపీ జడ్పీటీసీ నూకరాజు హత్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. కొయ్యూరు మండలం వైసీపీ నేత, జడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. భూమి విషయమై జరిగిన గొడవలో గిరిజనులు ఆయనను హత్య చేశారు. రోలుగుంట మండలం చటర్జీ పురం వద్ద వైసీపీ జడ్పీటీసీ నూకరాజుకు పది ఎకరాల పొలం ఉంది. ఈ భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీద ఉన్నప్పటికీ, ఆ భూమిని కొన్నేళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్నారు. ఈ కారణంగానే గత కొంతకాలంగా గిరిజనులకు, నూకరాజుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

గతంలో కూడా ఈ భూ వివాదం కారణంగా గిరిజనులు ఒకసారి నూకరాజుపై దాడి చేశారు. ఆ దాడిలో గాయపడిన నూకరాజు దాదాపు నెల రోజులపాటు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ గొడవల సమయంలో పోలీసులు బైండోవర్ కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ, ఈ వివాదం సద్దుమణగలేదు. సోమవారం ఉదయం నూకరాజు తన భూముల దగ్గరికి వెళ్లినప్పుడు, భూమి సాగు చేస్తున్న గిరిజనులకు, ఆయనకు మధ్య మళ్లీ వాగ్వాదం మొదలైంది.

మాట మాట పెరగడంతో, గిరిజనులు నూకరాజుపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న రోలుగుంటం పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నూకరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గిరిజనులు భూమి కోసం ఒక జడ్పీటీసీని హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |