నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన రౌడీషీటర్ రియాజ్ కేసు క్లోజ్ అయ్యింది. ఆదివారం అరెస్టు అయిన రియాజ్, ఇవాళ ఉదయం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన తర్వాత మూడు రోజులు తీవ్ర గాలింపు చర్యల అనంతరం రియాజ్ ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని లారీల్లో తలదాచుకున్నట్టు తెలుసుకొని పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. రియాజ్ కాలువలోకి దూకి పారిపోయేందుకు యత్నించగా, అక్కడే ఉన్న ఓ యువకుడు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘర్షణలో రియాజ్, ఆ యువకుడు గాయపడటంతో ఇద్దర్నీ పోలీసులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలోనే ఈ ఉదయం రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఎక్సరే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పారిపోవాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆత్మరక్షణ కోసం రియాజ్‌పై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. గతంలోనే రియాజ్ ఒక కానిస్టేబుల్‌ను హత్య చేసి, ఇంకో ఎస్సై విఠల్, ప్రమోద్ మేనల్లుడిని కూడా కత్తితో గాయపరిచి పరారయ్యాడు. అందుకే, మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు, హింసాత్మకంగా మారిన రియాజ్‌ను అదుపు చేయడానికి తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని నిజామాబాద్ సీపీ తెలిపారు.
ఈ ఎన్‌కౌంటర్‌కు ముందు, అరెస్ట్ సమయంలో రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేశారనే ప్రచారం జరిగింది, అయితే పోలీసులు దానిని ఖండించారు. అరెస్ట్ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించినా సంయమనంతో కాల్పులు జరపలేదని సీపీ తెలిపారు. అయితే, ఈరోజు గన్‌తో పారిపోయే క్రమంలో దాడికి యత్నించాడని, అందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో పాటు, కానిస్టేబుల్‌ను రౌడీషీటర్ హత్య చేసి పారిపోవడం, ఆ దాడిని స్థానికులు అడ్డుకోకుండా వీడియోలు తీయడం వంటి అంశాలపై పోలీసులకే రక్షణ కరువైందనే విమర్శలు వినిపించాయి.









