UPDATES  

NEWS

 అయోధ్యలో మరో కీలక ఘట్టం.. బృహస్పతి కుండ్ ప్రారంభోత్సవానికి సిద్ధం..

శ్రీరాముడి వెలసిల్లిన అయోధ్యలో మరో కీలక కార్యక్రమం జరగబోతుంది. అయోధ్యలో బృహస్పతి కుండ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇక్కడే దక్షిణ భారతదేశానికి చెందిన ముగ్గురు మహా వాగ్గేయకారుల విగ్రహాలు వెలసిల్లాయి. త్యాగరాజు, పురందర దాసు, అరుణాచల కవి విగ్రహాలను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది. దీంతో ఆ శ్రీరాముడి భక్తులైన ఈ వాగ్గేయకారులకు విశిష్ట గౌరవాన్ని అందించినట్టైంది.

 

అయోధ్యలో బృహస్పతి కుండ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయోధ్యలో మొత్తం 108 కుండ్‌లు ఉన్నాయి. వీటి ప్రస్తావన వేదాల్లో కూడా కనిపిస్తోంది. అందుకే వీటిని చాలా పవిత్రంగా చూస్తారు. ఈ 108 చిన్న జలాశయాల్లోనే త్రేతా యుగంలో శ్రీరాముడు, అతని సోదరులు స్నానం చేసి పలు పూజలు చేసేవారని నమ్ముతారు. ఇక్కడ నెలకొల్పబోయే ముగ్గురి విగ్రహాలు కూడా శ్రీరాముడి భక్తులవే. ఈ ముగ్గురు కూడా సంగీతారాధనతో దైవ నామస్మరణ చేశారు. ముందుగా త్యాగరాజు గురించి చూస్తే.. సంగీతంతో శ్రీరాముడిని సేవించారు ఆయన. త్యాగబ్రహ్మం, త్యాగయ్య, త్యాగరాజు పేర్లతో ప్రసిద్ధి చెందిన ఆయన… చిన్నతనం నుంచే సంగీతం పట్ల శ్రద్ధ చూపించారు.

 

శంఠి వెంకటరమణ భాగవతుల వద్ద శిష్యుడిగా చేరి వేదాల సారాన్ని అవపోసన పట్టారు. ఎన్నో కృతి రచనలు చేసిన త్యాగరాజు.. గేయ నాటకం ప్రహ్లాద భక్తి విజయం రచించారు. త్యాగయ్యకు స్వరార్ణవం అనే గ్రంథాన్ని నారదుడు వృద్ధుడి రూపంలో వచ్చి ఇచ్చినట్టు నమ్ముతారు. త్యాగరాజు నిత్యం కొలిచే రామ విగ్రహాన్ని కొందరు దొంగలిస్తే.. ఆ రాముడిని వెతుకుతూ అనేక పుణ్య క్షేత్రాలు తిరిగారట. అప్పుడే ఆయన ఎన్నో కీర్తనలు రచించారు. నాదోపాసనతో పరబ్రహ్మను చేరవచ్చని నిరూపించారు త్యాగరాజు. తన కృతుల్లో వేదోపనిషత్తుల సారాన్ని నింపిన ఆయన.. తెలుగు సాహితీ పరిమళాలను విశ్వవ్యాప్తం చేశారు. మొత్తం 24 వేల కృతులు, కీర్తనలు రచించారు త్యాగరాజు.

 

ఇక మరో వాగ్గేయకారుడు పురందరదాసు. ఆయన మహాభక్తుడిగా, సంకీర్తనా చార్యుడిగా గుర్తింపు పొందారు. వేదాల సారాన్ని సాధారణ బాషలో అందించడమే కాదు.. అద్భుతమైన సంగీతం, సరళమైన సాహిత్యం ఆయన సొంతమనే చెప్పాలి. కర్ణాటక శాస్త్రీయ సంగీత పితామహుడిగా గుర్తింపు పొందడమే కాదు.. మాయామాళవగౌళ రాగాన్ని ఆదిరాగంగా మార్చారు పురందరదాసు. మళహరి రాగంలో పిళ్లారి గీతాలు రచించారు పురందరదాసు. అరుణాచల కవి కూడా వీరికి తీసిపోరనే చెప్పాలి. రామాయణాన్ని గేయ నాటకంగా రచించారు. సాధారణ భాషలో పాటలు రచించి దేవుడిని ప్రజలకు దగ్గర చేసిన కవిగా గుర్తింపు పాందారు. తమిళనాడు ప్రజలకు రామాయణాన్ని దగ్గర చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన రచించిన రామనాటకం ఇప్పటికీ చాలా ప్రసిద్ధి అనే చెప్పాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |