UPDATES  

NEWS

 ఏపీ యువతకు లక్ష విదేశీ కొలువులు..! మంత్రి లోకేశ్ కీలక ప్రకటన..

రాష్ట్రంలోని యువతకు విదేశాల్లో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) ద్వారా రాబోయే ఐదేళ్లలో లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో కూడిన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులతో లోకేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ… నర్సింగ్, వెల్డర్స్, ట్రక్కర్స్, బిల్డింగ్ వర్కర్లకు యూరప్ తోపాటు జర్మనీ, జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యనభ్యసించిన యువతీయువకులకు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చి, విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేరళ మోడల్ ను అధ్యయనం చేయాలని అన్నారు.

 

యూరప్ జీసీసీలలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలపై దృష్టిసారించాలని, అందుకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఓంక్యాప్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీభాషల్లో శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. జర్మనీ, ఇతర విదేశీ భాషల్లో శిక్షణ కోసం DEFA, TELC (The European Language Certification) జర్మన్ లాంగ్వేజెస్ ఎసెస్ మెంట్ సెంటర్ ను రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పారు.

 

నైపుణ్యం పోర్టల్ పైనా మంత్రి లోకేశ్ సమీక్షించారు. ఇందులో 23 విభాగాల డాటా బేస్ ను ఇంటిగ్రేట్ చేసినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న 4,639 భారీ, మధ్యతరహా పరిశ్రమలతో సంబంధించి వారికి అవసరమైన విధంగా వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేయాలని అన్నారు. వచ్చేనెలలో పోర్టల్ ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.

 

ఐటీఐలలో మౌలిక సదుపాయాలు, ఆధునికీకరణ పనుల కోసం రూ.322 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఐటీఐలల్లో ప్రస్తుతం అడ్మిషన్లు పెరిగాయని, అయితే సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన, పీఎం ఇంటర్న్ షిప్ లలో ఏపీని నెం.1గా నిలపాలని మంత్రి అన్నారు. ఐటీఐలలో కరిక్యులమ్, టెస్టింగ్, ఇంటర్న్ షిప్, సర్టిఫికేషన్, ప్లేస్ మెంట్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలని సూచించారు. పీఎం సేతు పథకం కింద ఐటీఐల అప్ గ్రేడేషన్ కు గల అవకాశాలపై సమావేశంలో చర్చించారు.

 

రాష్ట్రంలో 87 పాలిటెక్నిక్ లకు సంబంధించి 646 టీచింగ్, 2183 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలలను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దేశంలోని సక్సెస్ మోడల్ ను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ లో విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 3 హబ్ లు, వాటిని అనుబంధంగా 13 స్పోక్స్ లలో ఐటీఐలను అభివృద్ధి చేయడానికి త్వరగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ చెప్పారు. ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ అనుబంధ సంస్థ నామ్ టెక్ ((New Age Makers’ Institute of Technology) రాష్ట్రంలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్ కార్పొరేషన్ సీఈవో గణేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |