UPDATES  

NEWS

 త‌మిళ‌నాడులో కీల‌క బిల్లుకు ఆమోదం..! బ‌ల‌వంతంగా అప్పు వ‌సూలు చేస్తే ఐదేళ్ల జైలు..!

తమిళనాడులో రుణాల రికవరీ పేరుతో జరుగుతున్న బలవంతపు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదముద్ర వేశారు. ఈ పరిణామం రాష్ట్రంలో రుణగ్రహీతల హక్కుల పరిరక్షణ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణిస్తున్నారు.

 

రుణ వేధింపులపై ఉక్కుపాదం

తమిళనాడు శాసనసభ ఇటీవల ఆమోదించిన “తమిళనాడు రుణ సంస్థల (బలవంతపు చర్యల నివారణ) బిల్లు, 2025” కు గవర్నర్ ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టం ప్రకారం అప్పులు ఇచ్చే సంస్థలు లేదా వాటి ఏజెంట్లు రుణాల వసూలు ప్రక్రియలో రుణగ్రహీతలను గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ ఎలాంటి బలవంతపు చర్యలకు గురిచేయరాదు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

 

అంతేగాక‌ రుణ సంస్థల వేధింపుల కారణంగా రుణగ్రహీత లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే.. అందుకు బాధ్యులైన వ్యక్తులు, సంస్థలపై భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 108 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా కేసు నమోదు చేస్తారు.

 

ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ… లోన్స్ ఇచ్చేవారు అవ‌లంభిస్తున్న‌ అనైతిక రికవరీ పద్ధతుల వల్ల అనేక మంది రుణగ్రహీతలు తీవ్ర ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇది కుటుంబాలను చిన్నాభిన్నం చేయడంతో పాటు సామాజిక శాంతికి భంగం కలిగిస్తోందని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఇలాంటి దోపిడీ పద్ధతుల నుంచి రక్షించేందుకు స్పష్టమైన చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉదయనిధి స్టాలిన్ వివరించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |