UPDATES  

NEWS

 మంత్రి కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్..!

తెలంగాణలో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ అనగానే గుర్తుకొచ్చేవారిలో మంత్రి కొండా సురేఖ ఒకరు. తనకు ఏదైనా తెలుస్తే ఓపెన్‌గా బయటపెడతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. అవే ఒక్కోసారి ఆమెకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి కూడా. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏమన్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

 

మంత్రి కొండా సురేఖ గురించి చెప్పనక్కర్లేదు. మనసులో ఏమీ దాచుకోకుండా నిజాన్ని ఓపెన్‌గా చెప్పేస్తారు. ఆ తర్వాత ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేశారామె. తమ వద్దకు వచ్చే పలు కంపెనీల ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. ఆమె మాటలతో కొందరు మంత్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ సమయం, సందర్భం ఏంటి?

 

వరంగల్‌లో ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమం గురువారం జరిగింది.దీనికి ముఖ్యఅతిధిగా ఆమె హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. కార్యక్రమం తర్వాత ఆమె మాట్లాడారు.

 

బాలికలకు ఉన్నత విద్య అందిస్తున్న కాలేజీ తరగతి గదులు వర్షానికి జలమయం అవుతున్నట్లు కొందరు తన దృష్టికి తెచ్చారన్నారు. పాత భవనాన్ని కూల్చేసి, కొత్త భవనం కట్టాలని అధికారులు సైతం తన దృష్టికి తెచ్చారన్నారు. ఇందుకోసం దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. దీనికి నిధులు ఎక్కడి నుంచి తేవాలో తనకు తెలియలేదన్నారు.

 

తాను అటవీ శాఖ మంత్రిగా ఉన్నానని,వివిధ కంపెనీలకు చెందిన ఫైళ్లు క్లియరెన్స్‌ కోసం తనవద్దకు వస్తాయన్నారు. మామూలుగా అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు మంత్రులు ఎంతో కొంత తీసుకుని వాటికి క్లియర్‌ చేస్తారన్నారు. తనకు మీరు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని అరవింధో ఫార్మా కంపెనీ వాళ్లకు చెప్పానన్నారు.

 

ఆ డబ్బులతో ప్రభుత్వ కళాశాల భవనం నిర్మించాలని సూచించానని తెలిపారు. దీనిపై ఆ కంపెనీ ఓనర్లతో మాట్లాడానని తన మాటకు ఒప్పుకున్నారు. మీరు సమాజ సేవ చేయండి.. మా స్కూల్‌‌ని అభివృద్ధి చేయాలని చెప్పినట్టు మనసులోని మాట బయటపెట్టారు.ఈ విషయంలో కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 

ప్రభుత్వ కాలేజీ నిర్మాణానికి నాలుగున్నర కోట్లు ఖర్చయిందని, తాను డబ్బు ఆశించకుండా కాలేజీ కట్టించారని తెలిపారు. చివరకు సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా కొత్త భవనాన్ని నిర్మిస్తుందని గుర్తు చేశారు. మంత్రి కొండా సురేఖ మాటలను ప్రత్యర్థులు భూతద్దంలో చూస్తున్నారు. ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారా? అంటూ మండిపడుతున్నారు.

 

మంత్రి సురేఖ తన మాటలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను మాట్లాడింది గత ప్రభుత్వ హయాంలోని మంత్రుల గురించి అని తెలిపారు. గతంలో ఏ పని చేయడానికైనా మంత్రులు డబ్బులు తీసుకునే వారని గుర్తు చేశారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ ఇస్తానన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |