ఉగ్రవాదులకు పాక్ మిలిటరీ మద్దతుగా ఉండటం సిగ్గుచేటు అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను వెల్లడించేందుకు భారత్ రక్షణ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు.
‘టెర్రరిస్టులకు పాక్ సైన్యం మద్దతుగా ఉండటం సిగ్గుచేటు. పాక్ సైన్యానికి జరిగిన నష్టానికి బాధ్యతవ హిస్తున్నాం. పాక్ ప్రజలకు ఎలాంటి నష్టం తలపెట్టలేదు. భారత్‌పై పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కశ్మీర్, పీవోకేలో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం. చైనా తయారీ ఆయుధాలను పడగొట్టాం. నూర్‌ఖాన్, రహీంయార్ ఖాన్ ఎయిర్ బేస్‌లపై దాడిచేశాం. రక్షణ వ్యవస్థలతో శత్రువుల ఆయుధాలు చిత్తుచేశాం’ అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు. ‘దేశప్రజలంతా మాకు అండగా నిలిచారు. శత్రువుల విమానాలను మనదేశంలోకి రాకుండా అడ్డుకున్నాం. మన అన్ని సైనిక స్థావరాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి ఆపరేషన్‌కు అయినా మేం సన్నద్ధంగా ఉన్నాం. పాక్‌కు జరిగిన డ్యామేజీ ఆ దేశం చెప్పుకోవడం లేదు’ అని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో పాకిస్థాన్ అటాక్ ను భారత్ ఎదుర్కొన్న వీడియోలును అధికారులు రిలీజ్ చేశారు.
ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను అంతం చేయడమే.. తమ ప్రాథమిక లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈ క్రమంలో పాకిస్థాన్ సైనిక దళాలు టెర్రరిస్టులకు సపోర్టుగా నిలిచాయని.. ఈ పోరాటాన్ని వారు తమదిగా భావించారని చెప్పారు. టెర్రరిస్టుల విషయంలో పాకిస్థాన్ సైన్యం జోక్యం చేసుకోవడంతో, భారత దళాలు తీవ్రంగా, దీటుగా ప్రతిస్పందించాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘర్షణలో పాకిస్థాన్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే.. దానికి పూర్తి బాధ్యత పాకిస్థాన్ దే అవుతుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. దాయాది దేశం పాకిస్థాన్ దాడులకు ప్రయత్నించిన సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేశాయని, శత్రువుల ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నాయని అధికారులు వివరించారు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం అండగా నిలవడం వల్లే పరిస్థితులు మారాయని, అందుకు తగిన జవాబు ఇచ్చామని డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు.