దేశ రాజధానిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై అనూహ్య దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయనపై దాడికి దిగారు. లిక్విడ్ పోశారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రిజియన్ పరిధిలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన సంభవించింది. గ్రేటర్ కైలాష్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయనకు అత్యంత సమీపానికి చేరుకున్నాడు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతోన్నట్లు నటించాడు. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న లిక్విడ్ను కేజ్రీవాల్‌పై చల్లాడు.
ఏ మాత్రం ఊహించని విధంగా ఆ వ్యక్తి తనపై లిక్విడ్ చల్లడంతో కేజ్రీవాల్ ఆందోళనకు గురయ్యారు. లిక్విడ్ శరీరం మీద పడిన వెంటనే రెండడుగులు వెనక్కి వేశారు. కొద్దిసేపు షాక్‌లో ఉన్నట్లు కనిపించారు. ఆ లిక్విడ్ కేజ్రీవాల్ ముఖం, భుజంపై పడింది. ఆయన దుస్తులు తడిచిపోయాయి.
ఈ ఘటనతో కేజ్రీవాల్ వెంట ఉన్న భద్రత సిబ్బంది, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకుని ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. అతని గురించి ఆరా తీస్తోన్నారు. దీని వెనుక గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు.
2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయి.. బెయిల్‌పై విడుదల అయ్యారు కేజ్రీవాల్. అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలను నిర్వహించి, మళ్లీ అధికారంలోకి వస్తానని, తన సచ్ఛీలతను ప్రజా కోర్టులో నిరూపించుకుంటానంటూ ప్రకటించారాయన. ఈ కారణంతోనే తన పదవికి సైతం రాజీనామా చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల వరకు జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం గుండా ఈ పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్‌ను రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం గ్రేటర్ కైలాష్‌లో పర్యటించారు.