దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ వివరాల మేరకు.. డిసెంబర్ ఆరో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.
ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల నుండి ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడగా, ఏపీ నుండి మూడు రాజ్యసభ స్థానాలకు కలిపి మొత్తం 6 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాజ్యసభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను డిసెంబర్ మూడో తేదీన వెలువడించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించగా, డిసెంబర్ 10 నామినేషన్ దాఖలకు ఆఖరి తేదీగా, డిసెంబర్ 11 నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు, డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, డిసెంబర్ 20 సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు సాగనుంది.
కాగా ఏపీలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి సీఎం చంద్రబాబు నాయుడు పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. వారిద్దరు వైసీపీ హయాంలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగగా, ఎన్నికల్లో కూటమి విజయానంతరం, వారు అనూహ్యంగా తమ పదవులకు రాజీనామా చేశారు.
అలాగే బీసీ నేత కృష్ణయ్య కూడా తమ పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తమ పదవులకు రాజీనామాలు చేసి టీడీపీలో చేరిన మోపిదేవి, బీద మస్తాన్ రావులకు మళ్లీ రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అలాగే కొత్త పేర్లు తెర మీదికి వస్తాయా అన్నది కూడా పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం ఈ విషయంపై చర్చ జోరందుకుంది.