బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్ ను వ్యాపారవేత్త సృజన్ రెడ్డి వేశారు.
అమృత్ టెండర్ల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా తనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని సృజన్ రెడ్డి తెలిపారు. 2011లో శోధ కన్ స్ట్రక్షన్స్ ప్రారంభమయిందని… దీనికి ఎండీగా దీప్తిరెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆ కంపెనీలో తనకు షేర్లు లేవని… తాను కనీసం డెరెక్టర్ గా కూడా లేనని తెలిపారు. ఆ సంస్థతో తనకు లింక్ పెట్టి కేటీఆర్ తప్పడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అమృత్-2లో ప్యాకేజీ-1 కాంట్రాక్ట్ ను ఏఎంఆర్, శోధ, ఐహెచ్ పీ సంస్థలు జాయింట్ వెంచర్ కింద దక్కించుకున్నాయని సృజన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ చెపుతున్నట్టు జాయింట్ వెంచర్ లో శోధకు 80 శాతం కాకుండా 29 శాతం మాత్రమే వాటా ఉందని చెప్పారు. ఆన్ లైన్లో టెండర్లను పిలిచారని, పారదర్శకంగానే కేటాయింపులు జరిగినప్పటికీ… కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేవలం తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. లీగల్ నోటీసులు ఇచ్చినా కేటీఆర్ తీరు మార్చుకోలేదని… అందుకే క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు.