తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమెదించనున్నారు. రైతు భరోసా, రుణమాఫీ అంశాలతో పాటూ కులగణన సర్వేపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తరవాత రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ జరగనుందని తెలుస్తోంది.
డిసెంబర్ 7వ తేదీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. దీంతో ఆ లోపే మంత్రివర్గ విస్తరణ జరగనుందని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కులగణన తరవాత పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు సవరించి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పంచాయితీ ఎన్నిలకపై కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
అంతే కాకుండా ఎన్నికలకు ముందే రాష్ట్రంలో ఆసరా పెన్షన్, మరికొన్ని హామీలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ఇస్తున్నప్పటికీ గత ప్రభుత్వంలో ఇచ్చిన విధానాన్నే కొనసాగిస్తున్నారు. కాగా ఇప్పుడు పెన్షన్ కూడా పెంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా రేవంత్ సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో ప్రతిపక్షం అధికారపక్షం మధ్య చర్చలు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. దీంతో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.