సినీ నటుడు, టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తొలి రెండు సీజన్లు ఈ షో సూపర్ సక్సెస్ ను అందుకుంది. తన బావ, సీఎం చంద్రబాబు సహా బాలయ్య పలువురు సెలబ్రిటీలను ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేశారు. ప్రేక్షకులను అలరింపజేశారు. తాజాగా మూడో సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో బాలయ్య సందడి చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ను నిన్న చిత్రీకరించారు. దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ షోలో బాలయ్య పంచ్ లు, ప్రశ్నలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.