బీఆర్ఎస్పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన శనివారం సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. దీంతో త్వరలో ఎమ్మెల్యే మహిపాల్పాల్రెడ్డి కూడా కాంగ్రెస్చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిపాల్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరితే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరనుంది.
కాగా, శనివారం మధ్యాహ్నమే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫొటోలను స్టేటస్‌లో పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే చేరుతున్నారని ప్రచారం జరిగింది. తాజాగా, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మరో ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
2014 నుంచి వరుసగా మూడుసార్లు బీఆర్ఎస్ నుంచి మహిపాల్ రెడ్డి గెలిచారు. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలేరు యాదయ్య, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, సంజయ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.