పార్లమెంట్ ఎన్నికల ముందు 400 సీట్ల టార్గెట్ గాలిలో కలసిపోయింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోలేక సంకీర్ణ ప్రభుత్వంగా మారిన బీజేపీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. ఎవరికైతే 40 కన్నా ఎక్కువ స్థానాలు రావని గేలిచేశారో ఇప్పుడు ఆ పార్టీయే మోదీకి చుక్కలు చూపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికలు 13 రాష్ట్రాుల అసెంబ్లీ స్థానాలకు జరిగాయి. అనూహ్యంగా ఇండియా కూటమి అభ్యర్థులు 10 స్థానాలు కైవసం చేసుకున్నారు. మోదీ నేతృత్వంలో ఎన్టీఏ కూటమి కేవలం రెండు స్థానాలకే పరిమితం కాగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
సార్వత్రిక ఎన్నికలలో గుణపాఠం
పదేళ్లు ఏకచ్ఛత్రాధిపత్యంగా తనకు ఎదురే లేదన్న ధీమాగా సాగింది మోదీ ప్రభుత్వం. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు మోదీకి గట్టి గుణపాఠమే చెప్పాయి. కేవలం అభివృద్ధి సంక్షేమ పథకాలను పక్కన పెట్టి..ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం చేశారు మోదీ. అయోధ్య లో రామాలయం కట్టి దేశవ్యాప్తంగా ప్రచార లబ్ధి పొందామని భావించారు బీజేపీ శ్రేణులు. చివరకు అయోధ్య నియోజకవర్గంలోనే అభ్యర్థిని గెలిపించుకోలేక చతికిల పడ్డారు. అంతేకాదు మోదీ పోటీచేసిన వారణాసి లోనూ మెజారిటీ దక్కించుకోలేకపోయారు.
ప్రతిపక్షాన్ని తక్కువగా అంచనా
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్రను బీజేపీ అస్సలు పట్టించుకోలేదు. తాము ఏం చెప్పినా ప్రజలు వింటారనే ధోరణితో నడిచారు. ఇవన్నీ మోదీపై వ్యతిరేకత చూపించాయి. మోదీ వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దవుతాయనే ప్రచారం బాగా జరిగింది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలలో మోదీ అండ్ కో చేసిన విద్వేష ప్రసంగాలు బెడిసికొట్టాయి. ఎన్టీయే కూటమి ముస్లిం వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆ ప్రభావం ఓటింగ్ సరళిపై పడింది. మోదీ సర్కార్ మెజారిటీ సీట్లకు గండి పడింది. మోదీకి ఉత్తరప్రదేశ్ లో భారీా ఓట్లు తగ్గడానికి కారణం ఆర్ఎస్ఎస్. ఈ సార్వత్రిక ఎన్నికలలో ఆర్ఎస్ఎస్, బీజేపీ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. గత కొంతకాలంగా మోదీ ఆర్ఎస్ఎస్ విధానాలకు దూరంగా ఉంటున్నారు. వారు సూచించిన అభ్యర్థులను గాక తన సొంత నిర్ణయాలతో అభ్యర్థుల ఎంపిక జరిగింది.
ఆర్ఎస్ఎస్ ని దూరం పెట్టారా?
ఆర్ఎస్ఎస్ సూచనలు ఎంతమాత్రం తీసుకోలేదు. పైగా అక్కడ యోగీ సర్కార్ పై వచ్చిన ప్రజా వ్యతిరేకత యూపీ ఓటింగ్ పై పడింది. యోగీ సర్కార్ వచ్చినప్పటినుంచి ముస్లింలను టార్గెట్ చేసి..వారిపై ప్రజాద్రోహ ముద్రవేసి వారి ఇళ్లపై బుల్ డోజర్ లను ఎక్కించి బీజేపీ ఓటు బ్యాంకుకు కావలసినంత డ్యామేజ్ చేశారు. అందుకే ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో నడుస్తున్న బీజేపీ కి ఇప్పుడు నాయకత్వం మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మోదీ తర్వాత ఆ స్థాయి లీడర్ ఎవరనేది చర్చ నడుస్తోంది. మోదీ వయసును కూడా దృష్టిలో పెట్టుకుని మార్చవలసిన విషయాలపై చర్చలు నడుస్తున్న వేళ..మరోసారి ఉప ఎన్నికలలో మోదీ చేతులు ఎత్తేయడంతో బీజేపీకి కష్టకాలం దాపురించింది. సొంత పార్టీలోనే ఇప్పుడు మోదీ నాయకత్వంపై అనుమానాలు మొదలయ్యాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి గెలుపు గాలి వాటం కాదని ఈ ఉప ఎన్నికలు నిరూపించాయి. ఈ సంవత్సరం నవంబర్ లో జరుగనున్న హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల ఉప ఎన్నికలలో మళ్లీ ఇవే ఫలితాలు రిపీట్ అయితే మోదీకి ఇక కష్టకాలమే.