సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నిజయోకవర్గాల్లో జులై 10న ఉపఎన్నికలు జరిగాయి. కాగా, ఈ ఉపఎన్నికల ఫలితాలు శనివారం(జులై 13న) వెలువడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
కాగా, ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉదయం పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగాధ్, మనిక్‌టాలా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ వెస్ట్, హిమాచల్‌లోని డెహ్రా, హమీర్‌పూర్, నాలాగఢ్, బీహార్‌లోని రూపాలి, తమిళనాడులోని విక్రవండి, మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు.
బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయటం, మరికొంత మంది మరణించటంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఆయా స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
కాగా, ఈ ఉప ఎన్నికల ఫలితాలు నేడు (జులై 13న) వెలువడనున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమ్లేష్ ఠాకూర్‌తోపాటు మరికొంత మంది తొలిసారిగా ఎన్నికల బరిలో దిగడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఉపఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారా? లేక ఇండియా కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేస్తారా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.