ఏపీలో కందిపప్పు, బియ్యం ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.200 వరకూ పలుకుతుండగా.. బియ్యాన్ని రూ.70-100 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేదలు వీటిని కొనుగోలు చేసి తినే పరిస్ధితి లేదు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఈ రెండు వస్తువులను రాయితీ ధరలపై పంపిణీ చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కందిపప్పు, బియ్యం ధరల నేపథ్యంలో మిల్లర్లు, హోల్ సేల్ వర్తకులు, పంపిణీ దారులతో భేటీ అయిన పౌరసరఫరాల మంత్రి మనోహర్.. వారిని ప్రభుత్వానికి తక్కువ ధరకు అందించేలా ఒప్పించారు. దీంతో ప్రభుత్వం ఎల్లుండి నుంచి రాయితీపై కందిపప్పు, బియ్యం రైతు బజార్లలో అందుబాటులోకి తీసుకు రానుంది. కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో రూ. 181 పలుకుతున్న నేపథ్యంలో దీన్ని రూ.160కే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాగే బియ్యంలో రెండు రకాల్ని రైతు బజార్ల ద్వారా రాయితీ ధరలపై విక్రయించనున్నారు. కిలో స్టీమ్డ్ బియ్యం బహిరంగ మార్కెట్లో రూ.55.85 ఉన్న నేపథ్యంలో దీన్ని రూ.49కే ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే సాధారణ బియ్యం కిలో రూ.52.40 ఉన్న తరుణంలో దీన్ని రూ.48కే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాయితీ ధరలపై రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం స్టాక్ ను ఎల్లుండి నుంచి అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ప్రజలకు కాస్త ఊరట దక్కుతుందని భావిస్తున్నారు.