ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పెన్షన్ల పెంపు అమలు చేస్తున్న ప్రభుత్వం.. రైతుభరోసా పైన ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తే రైతులకు రూ 20 వేలు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. అందులో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే పథకం పేర మార్పు చేసింది. అదే విధంగా మూడు విడతల్లో ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పథకం పేరు మార్పుతో ఏపీ ప్రభుత్వం రైతులకు ఆర్దికంగా తోడ్పాటు అందించే పథకం పేరు అన్నదాత సుఖీభవగా ఖరారు చేసింది. ఇందు కోసం కొత్తగా ఒక పోర్టల్ సిద్దం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం గతంలో వైఎస్సార్ రైతు భరోసా పేరుతో రైతులకు ఏడాదికి రూ 13,500 చొప్పున అందించేవారు. తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తం రూ 20 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. తాజాగా ప్రభుత్వం పోర్టల్ ప్రారంభించిన తరువాత విధి విధానాలను ఖరారు చేయనుంది. ఈ పథకం అమలు కోసం కొత్త విధానం అమల్లోకి తెచ్చేలా కసరత్తు కొనసాగుతోంది.
రైతులకు ఆర్దికంగా హామీ ఇచ్చిన విధంగా రూ 20 వేల మొత్తాన్ని మూడు విడతల్లో రైతుకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, పీఎం కిసాన్ నిధులు రూ.6000 చొప్పున మొత్తాన్ని అన్నదాతలకు అందించనుంది. ప్రభుత్వం తీసుకొస్తున్న పోర్టల్ లో రైతులు ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. రైతులు ఆధార్ కార్డు , భూమి పత్రాలు, ల్యాండ్ పాస్ బుక్, రేషన్ కార్డు ఆదాయ పత్రంతో పాటుగా మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం. కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందేలా నిబంధనలు ఖరారు అవుతున్నట్లు సమాచారం.
అమలు దిశగా ఈ పథకం పూర్తిగా అర్హులైన రైతులకు అందేలా మార్గదర్శకాలు సిద్దం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో కేంద్రం,రాష్ట్ర బడ్జెట్ పూర్తి అయిన తరవాత ఆర్దిక వెసులుబాటుకు అనుగుణంగా పథకాల అమలు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వంలోని ముఖ్యులు..రాష్ట్రంలో నెలకొన్న ఆర్దిక పరిస్థితుల గురించి ప్రస్తావన చేస్తున్నారు. అందులలో భాగంగా రైతుల పెట్టుబడి సాయంగా ఇచ్చే అన్నదాత సుఖీభవ నిధుల జమ పైన ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది.