నామినేటెడ్ పదవులను సీఎం రేవంత్ ఖరారు చేసారు. ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు నేతలు నామినేటెడ్ పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందే నామినేటెడ్ పదవుల పైన నిర్ణయం తీసుకున్నా ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వుల అమలు కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం 37 కార్పోరేషన్లకు ఛైర్మన్ల నియామకం పైన జీవో విడుదల చేసింది. త్వరలోనే మరో విడత పోస్టుల భర్తీ ఉంటుందని చెబుతున్నారు.
పదవుల భర్తీ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను తెలంగాణ సర్కార్ భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే హస్తం పార్టీలో చాలామంది ఆశావహులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. టికెట్ ఇవ్వలేకపోయినవారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులతో సర్దుబాటు చేశారు. ప్రధానంగా టీఎస్ ఆర్టీసీ, ఐఐసీ మినహా ముఖ్యమైన పదవులు వీరికి కేటాయించింది.
ఎవరికి ఏ పదవి మరోవైపు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం, వక్ఫ్ బోర్డు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్ పదవి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా జబ్బార్, సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా అలేఖ్య పుంజాల,మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈరవత్రి అనిల్, కూడా(KUDA) కార్పొరేషన్ చైర్మన్‌గా ఇనగాల వెంకట్రామిరెడ్డి, గ్రామీణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా చల్లా నర్సింహారెడ్డి, టీఎస్ ఐఐసీ చైర్మన్‌గా జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి నియమతులయ్యారు.
ఉత్తర్వులు జారీ అదే విధంగా..ఫారెస్ట్ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పొదెం వీరయ్య, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా కాల్వ సుజాత, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గురునాథ్‌రెడ్డిని నియమించారు. మైనింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా నేడు భాధ్యతలు స్వీకరించనున్న ఈరవత్రి అనీల్, కూడా(KUDA) కార్పోరేషన్ ఛైర్మన్‌గా భాధ్యతలు స్వీకరించనున్న ఇనగాల వెంకట్రామిరెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా చల్లా నర్సింహారెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు