UPDATES  

NEWS

 జనం గుండెల్లో చెరగని రాజముద్ర వైఎస్సార్..!!

వైఎస్సార్. ఈ పేరే ఒక వైబ్రేషన్. తెలుగు ప్రజలు మరిచిపోలేని పేరు. జనం గుండెల్లో ఆయనది చెరగని స్థానం. రాజన్న పేరులోనే కాదు.. మ్యానరిజంలోనూ రాజసం. అన్నివేళలా ఆకట్టుకునే చిరుదరహాసం.. మడమతిప్పని గుణం.. ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం. సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం. జనంలోంచి వచ్చిన మాస్ లీడర్‌. శత్రువును సైతం ఆప్యాయంగా పలకరించే అరుదైన నేత.ప్రజలకు దూరమై 15 ఏళ్లు అవుతున్నా.. కళ్లముందు కదలాడే రూపం వెనుకున్న జ్ఞాపకాలు. నేడు వైఎస్సార్ జయంతి.

 

ఓటమెరుగని నేత వైఎస్సార్. సేవకుడిగా నిలిచిన అరుదైన పాలకుడు. తెలుగు రాజకీయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు. వరుసగా కాంగ్రెస్ ను ఉమ్మడి ఏపీలో అధికారంలోకి తెచ్చిన నాయకుడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం దక్కేలా చేసారు. 1949, జులై 8.. వైఎస్ఆర్ పుట్టిన రోజు. నాటి కడప జిల్లా పులివెందులలో జయమ్మ, రాజారెడ్డి దంపతులకు కుమారుడు వైఎస్. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై వైఎస్సార్ ఆసక్తి పెంచుకున్నారు. డిసిన్ పూర్తి చేసి వైద్య వృత్తిని స్వీకరించారు. రూపాయికే వైద్య సేవలందించి రూపాయి డాక్టర్ గా పేరుపొందారు. అనంతరం రాజకీయరంగ ప్రవేశం చేసి ఓటమెరగని నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. యువజన నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.

 

అరుదైన నాయకత్వం కాంగ్రెస్ లో నాడు ఉన్న పరిస్థితుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా రాజకీయం చేసారు. ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న తరుణంలో కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వైఎస్సార్ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓటమి లేని ప్రస్థానం కొనసాగించారు. మొదటి సారి 1989లో పార్లమెంటుకు పోటీ చేసిన వైఎస్సార్ ప్రత్యర్థిపై 1,66,752 మెజారిటీతో గెలుపొందారు. తర్వాత 1991 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 4,18,925 రికార్డు స్థాయి మెజారిటీ సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఓటమి ఎరుగని నాయకుడిగా కడప రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. వైఎస్సార్‌ను అభిమానులు పులివెందుల పులి గా ముద్దుగా పిలుచుకొనే వైఎస్సార్ పులివెందుల నుంచే 2004, 2009లో గెలిచి సీఎం అయ్యారు.

జనం మెచ్చిన నాయకుడు 2004లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎండగడుతూ పాదయాత్రతో చంద్రబాబుకు చెక్ పెట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు వరకు ప్రాంతాలన్నీ కలియతిరుగుతూ, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వారికి నేనున్నానని భరోసానిస్తూ ముందుగుసాగారు. ఆ పాదయాత్ర ఫలితమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టారు. 2004, మే 14న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా ” యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అను నేను” అంటూ ప్రమాణ స్వీకారం చేసారు. తిరిగి 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంతో రెండోసారి సీఎం అయ్యారు.

 

జనం గుండెల్లోనే ఆరోగ్యశ్రీ ప్రదాత. ఫీజు రియంబర్స్మెంట్ సృష్టికర్త, కొన్ని లక్షల మందిని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారుచేసిన సంక్షేమ సారధి డాక్టర్ వైఎస్ఆర్. అయితే, రెండోసారి కేవలం సీఎం అయిన మూడు నెలలకే సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఊహించని రీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. విధి ఆయన్ని భౌతికంగా దూరం చేసిందే కానీ.. జనం గుండెల నుంచి దూరంగా తీసుకుపోలేకపోయింది. అందుకే.. ఆయన జనం నుంచి దూరమై పుష్కరకాలం దాటినా.. ఆ చిరునవ్వు చేసిన సంతకం మాత్రం ఇంకా జనం జ్ఞాపకాల్లో చెక్కుచెదరలేదు. ఆయనపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గలేదు. ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే అరుదైన నాయకత్వం వైఎస్సార్ సొంతం. వైఎస్సార్ జన్మదినం వేళ అందరూ గుర్తు చేసుకుంటున్నారు. నివాళి అర్పిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |